భారతదేశం ఎదుర్కొంటున్న 10 ముఖ్య సమస్యలు

 

బాధ్యత లేని ప్రజలు

దేశం, సమాజం ఏమైనా కానీ, ఏటైనా పోనీ, నేను, నా కుటుంబం బాగుంటే చాలు అనే ధోరణి దేశంలో బాగా పెరిగిపోయింది. దేశాన్ని మార్చడం అసాధ్యం అనే నిరాశ, ఏ నాయకుడిని నమ్మలేని అవిశ్వాసం, దేశం ఇలాగే ఉంటే మన తర్వాతి తరాలు ఎంత నష్టపోతాయో అనే ఆలోచన లోపించడం, డబ్బు ఉంటే చాలు ఏమైనా చేయొచ్చు అనే భావన పెరిగిపోవడం, కులమత పిచ్చి పెరిగిపోవడం, వీటన్నిటికి కారణంగా ప్రజలు సమాజం గురించి, పాలన గురించి పట్టించుకోవడం మానేసి, రాజకీయాలని ఒక IPL మ్యాచ్ లాగా భావిస్తున్నారు.

ముందుచూపు లేని పాలన

నిరంతర ఓట్ల వేట, కోట్ల సంపాదనపై తప్ప ముందు చూపు లేని పాలన వల్ల మన జీవనం అస్తవ్యస్తం అయిపోతోంది. నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచించి పనిచేయాల్సిన ప్రభుత్వాలు, నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవడమే లక్ష్యంగా పనిచేస్తుండడంతో మన రోడ్లు, డ్రైనేజి లైన్లులాంటి మౌలిక సదుపాయాల దగ్గర నుండి పర్యావరణం దాకా అన్ని రంగాల్లో మనం నష్టపోతున్నాం.

అభివృద్ధి మింగేస్తున్న సంక్షేమం

రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజ్ లాంటి మౌలిక వసతులు కల్పించడం, ప్రజలకి విద్య, ఆరోగ్యం అందించడం, శాంతిభద్రతలు కాపాడడం. ఈ మూడూ ప్రభుత్వాల ప్రధాన విధులు. ఓట్ల వేటలో పడిన ప్రభుత్వాలు. ఈ మూడూ తప్ప మిగిలినవి చేస్తున్నాయి. అప్పుచేసో, ప్రభుత్వ ఆస్తులు అమ్మేసో, వచ్చిన డబ్బుని సగం దోచేయడం, మిగిలిన సగాన్ని ఏదో ఒక పథకం పేరుతో ప్రజలకి పంచి పెట్టడం ఇదే ఇప్పుడు పరిపాలన నడుస్తున్న తీరు. దీనితో మొత్తంగా దేశాభివృద్ధి ఆగిపోతోంది.

ముగ్గురి చేతిలో అధికారం

జాతీయ స్థాయిలో ప్రధాని, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి, అసెంబ్లీనియోజకవర్గ స్థాయిల ఎమ్మెల్యే. మొత్తం అధికారం ఈ ముగ్గురి చేతుల్లోనే ఉంది. ప్రజలకి దగ్గరగా ఉండే స్థానిక ప్రభుత్వాలైన పంచాయితీలు, మున్సిపాలిటీలు కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయాయి ఒక్కమాటలో చెప్పాలి అంటే. మన సమస్యల పరిష్కారానికి, పైవాడికి ఖాళీ ఉండదు..కిందవాడికి అధికారం ఉండదు.

స్వతంత్ర వ్యవస్థల నిర్వీర్యం

పాలనలో చెక్స్ అండ్ బాలెన్సెస్ కోసం కొన్ని స్వతంత్ర ప్రతిపత్తి గలసంస్థలను ఏర్పాటు చేసారు. ఉదాహరణకు ఎన్నికల కమీషన్, కాగ్, రిజర్వ్ బ్యాంక్ లాంటివి. ఇప్పుడు ఈ వ్యవస్థలను అన్నీ రాజకీయ ప్రాబల్యానికి లోనవుతున్నాయి. దీనితో ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు దేశాన్ని, రాష్ట్రాన్ని ఏమైనా చేయొచ్చు అనే ధోరణి పెరిగిపోతోంది.

విలువ లేని రాజకీయాల

మన రాజకీయాలని మూడు మాటల్లో చెప్పాలి అంటే.. నోట్లు.. సీట్లు..కోట్లు. నోట్లు ఖర్చు పెట్టి సీటు గెలవడం, గెలిచాక కోట్లు సంపాదించుకోవడం. ఇదే రాజకీయం. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు లేవు, విధేయతలు లేవు, విశ్వసనీయత అనే మాటకి అర్థమే లేదు. ఇంత దిగజారిన రాజకీయాలతో ఏ ప్రజాస్వామ్య దేశం అయినా బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడం అసాధ్యం.

సామాజిక మూలాలు మరచిన ఆర్థిక అభివృద్ధి

ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకు కులవృత్తులు చేసుకునేవారికి; డాక్టర్లు, టీచర్లు, లాయర్లులాంటి ప్రొఫెషనల్స్ కి సొంతంగా ఎదిగే అవకాశాలు ఉండేవి. ఇప్పుడు అన్ని వృత్తులలోకి కార్పోరేట్స్ వచ్చేసాయి. డాక్టర్ అయితే కార్పొరేట్ హాస్పిటల్ లో ఉద్యోగం చేయాలి, టీచర్ అయితే కార్పొరేట్ స్కూల్ లో ఉద్యోగం చేయాలి, బార్బర్ అయితే కార్పొరేట్ సెలూన్ లో ఉద్యోగం చేయాలి, కిరాణ షాపు నడిపే వాళ్ళు మాల్స్ లో సేల్స్ బాయిస్ గా, ఈ కామర్స్ సంస్థల్లో డెలివరీ బాయ్స్ గా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. ఇలా అన్ని వృత్తులు, రంగాలలోకి కార్పొరేట్ సంస్థలు వచ్చేసాయి. దీనితో 90% జనాభాకి ఎదిగే అవకాశాలు దూరం అయ్యాయి. ఈ సామాజిక మూలాలు మరచిన అభివృద్ధి నమూనా మనకి అవసరమా?

అన్ని దశల్లో పేరుకుపోయిన అవినీతి

మనదేశంలో అవినీతి ఎంతగా పెరిగిపోయింది అంటే, మనం అవినీతికి అలవాటు పడిపోయాం. ఈ అవినీతి కారణంగా దేశానికి ఆర్ధిక నష్టంతో పాటు, యువత మనసుల్ని చెడగొట్టేస్తోంది. అవినీతి నాయకులని ఆదర్శంగా తీసుకుంటున్న యువత, కష్టపడి పనిచేసి ఎదగాలనే ఆలోచన వదిలేసి, షార్ట్ కట్స్ లో ఎదగాలని చూస్తోంది. ఫలితంగా ప్రతిరంగంలో నిబద్ధత కలిగిన ఉద్యోగులు దొరకడం దాదాపు అసాధ్యం అయిపోయింది.

అభివృద్ధి కేంద్రీకరణ

ఆర్థికాభివృద్ధికి పెద్ద పెద్ద నగరాలు అవసరమే కానీ, నగరాల మోజులో, మనం పల్లెల్ని, పట్టణాలని నిర్లక్ష్యం చేస్తున్నాం. మన గ్రామాలలో దాదాపు ప్రతి ఒక్కరికి ఇల్లు/ ఇంటి స్థలం, తాగునీటి వసతి, సరిపడా రోడ్లులాంటి సౌకర్యాలు ఉంటాయి,. గ్రామాల్లో ఉన్న ఈ వసతులని వృధాగా వదిలేసి, నగరాల్లో ఇవి కొత్తగా ఏర్పాటు చేయాల్సిరావడం వల్ల ఎన్ని వనరులు వృధా అవుతున్నాయో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నగరాలతో పాటు, చిన్నపట్టణాలని కూడా అభివృద్ధి చేయడం ద్వారా ఒక సమతౌల్యాన్ని తీసుకురావలసిన అవసరం ఉంది.

విశ్వసనీయత కోల్పోయిన మీడియ

రాజకీయ, వ్యాపార ప్రయోజనాలకోసం మీడియా అసత్య వార్తలని, అనవసర వార్తలని, సంచలన వార్తలని వండి వారుస్తోంది. ఇప్పుడు జర్నలిజం కాస్తా ఎర్నలిజం అంటే సంపాదనా మార్గంగా మారిపోయింది. అర్థవంతమైన చర్చల్లేవు, అవగాహన పెంచే విశ్లేషణలు లేవు. కేవలం అరుపులు, కేకలు, అసత్యాలు, అర్థసత్యాలు మాత్రమే మన మీడియాని నడిపిస్తున్నాయి.